మీతో సరదాగా నా జీవితంలో జరిగిన ఇంటర్వ్యూ ప్రయాణం పంచుకోవాలని ఉంది.
నా బిటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి అయిన తరువాత సరదాగా ఒక పరీక్ష రాసాను. నాకు ఆ ఉద్యోగం మీద పెద్దగా ఆసక్తి లేదు, అలా అని ఆ ఉద్యోగం వస్తే చేయడానికి విముఖత కూడా లేదు. చాలా తటస్థంగా ఉన్నాను ఆ ఉద్యోగ విషయంలో. కానీ మా నాన్నగారికి నన్ను ఆ ఉద్యోగంలో చూడాలని ఆశ ఉందేమో అని నాకు అనిపించింది!
ఉద్యోగం లేక కాళిగా ఉన్న రోజులవి! నేను రోజూ యదావిధిగా పొద్దున్న ఇంట్లో టిఫిన్ చేసి మా స్నేహితులతో కలసి ఊరిమీద దండయాత్ర చేయడానికి వెళ్లే వాడిని! అప్పటికే నా స్నేహితులలో చాలామంది మా ఊరిలో ఉన్న ముఖ్యమైన వార్తా కధనాలు మోసుకొచ్చేవారు. వారికి ఇంతకముందు బీబీసీ వార్తా ఛానల్ లో పనిచేసిన అనుభవం ఉండడం వలన వార్తలు చాలా వేగంగా చేరేవి మా దగ్గరికి. మా స్నేహితుడు ఒకడు, ఒరేయ్ ఆ వనజ లేదు మనతో పాటు ఇంటర్ చదివింది కదా, నిన్ననే TCS లో ఉద్యోగం వచ్చిందంట తెలుసా? ఇంకొకడు ఆ రవిగాడు M.S చేయడానికి అమెరికా వెళుతున్నాడంట! ఇలా మా ఊరిలోని దాదాపు ప్రతి ఇంటిలోని ముఖ్య విశేషాలను సూదీర్ఘంగా చర్చించే పనిలో ఉండేవాళ్ళు మా స్నేహితులు. ఎందుకురా ఇవ్వని అని నేను అంటే, ఖాళీగా ఉండి చేసేదేముంది, ఇలాంటివి చర్చించుకుంటే కొంత జనరల్ నాలెడ్జి వస్తది అని మా వాళ్ళ ఆర్గుమెంట్ (అదేందో ఈ జనరల్ నాలెడ్జితో UPSC గ్రూప్ పరీక్షల పోటీని క్రాక్ చేసేటటు బిల్డ్ అప్ ఒకటి మా వాళ్లకి ).
ఒక రోజు సాయంత్రం ఎదావిదిగా మా స్నేహితులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్ళాను. ఇంట్లో నిశబ్దం, ఎవరు మాట్లాడడం లేదు. నాకేదో తడుతుంది! ఇంతలో మా నాన్నగారు ఎదో లెటర్ పట్టుకుని నా వంక చూడడం మొదలుపెట్టారు. నాకు అదేదో ప్రేమతో కూడిన, గర్వం వళ్ళ వచ్చిన ఒక తండ్రి చూపులా అనిపించింది! మా నాన్న నా బుజం మీద చేయివేసారు! నాన్న నీకు భారత వాయుసేన (indian airforce) నుండి రెండు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి, ఒకటి విమాన ఇంజనీర్ గా, ఇంకొకటి పైలట్ గా అని చెప్పారు. మా నాన్నగారేమో తెగ ఫీల్ అయిపోతున్నారు, నాకు పెద్దగా ఆసక్తి లేనందు వలన నాకు ఫీలింగ్స్ ఏమి రాలేదు!
మా నాన్నగారి మొహం చూసి అప్పుడు నాకు వెంకీ మామ డైలాగు ఒకటి గుర్తువచ్చింది, “పొదిగిన గుడ్డు పిల్లయినప్పుడు కోడికి, ఎదిగిన కొడుకు ప్రయోజకుడినందుకు తండ్రి కలిగే ఆనందం మాటలలో చెప్పలేము అని” — :p
రేపే బయలుదేరాలి అని మా నాన్న నా ప్రయాణ ఏర్పాటులో నిమగ్నం అయ్యారు. కానీ ఒక సమస్య, అప్పటికే మైసూర్ వెళ్ళడానికి రైళ్లలో రిజర్వేషన్ లేదు, మరుసటి రోజునే ఇంటర్వ్యూ. సరే ఏది అయితేనేం, గుంటూరులో ప్రశాంతి ఏక్సప్రెస్ బోగిలోకి చేరుకున్నాము. ఈ లోపల మా నాన్నగారు అక్కడ ఉన్న TT గారిని కలిసి, సార్ నమస్కారం అండి, మా వాడు ఎయిర్ ఫోర్స్ ఇంటర్వ్యూ కి సెలెక్ట్ అయ్యాడు(కొంత ప్రేమతో కూడిన గర్వంతో చెపుతూ :p), ఎల్లుండే ఇంటర్వ్యూ, కొంచెం పడుకోడానికి బర్త్ చూడండి సర్ అని మా నాన్న ఆయనకు చెప్పాడు. అయన (TT) ఇంకా ఫీల్ అయిపోయి, నా భుజం మీద చేయి వేసి, వెరీ గుడ్ మై బాయ్ అని అన్నాడు! నేనేమో మనసులో “ఇదేంటి ఈయన కూడా ఇంత ఫల్ అయిపోతున్నాడు, నేనే ఏమి ఫీల్ అవ్వడం లేదు, ఈయన కూడా కోడి గుడ్డు పిల్లయిందా అని అనుకుంటున్నాడా ఏంటి కొంపదీసి అని అనుకున్నాను”! సరే మొత్తానికి TT గారు నాకు బర్త్ ఏర్పాటు చేసారు, అయన వాటా అయన తీసుకున్నారు లెండి, అది వేరే విషయం! 🙂
మొత్తానికి మైసూర్ నగరానికి మరుసటి రోజు రాత్రికి చేరుకున్నాను. ఉదయాన్నే ఎయిర్ ఫోర్స్ వారి వాహనం 7 గంటలకు మైసూర్ స్టేషన్ నుండి బయలుదేరుతుంది అని నాకు సమాచారం అందింది. రాత్రి మైసూర్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఒక హోటల్లో పడుకున్నాను. తెల్లారి 6:50 కి మేలుకొచ్చింది, ఎమ్మటే ఇంటి నుండి తెచ్చుకున్న మూట సర్దుకుని, పరిగెత్తుకుంటూ హోటల్ బయటకు వెళ్లి ఎయిర్ ఫోర్స్ వారి వాహనంను అదృష్టవశాత్తు అందుకున్నాను. బస్సు ఎక్కిన తరువాత గుర్తు వచ్చింది ఆ హోటల్ అతను నాకు అడ్వాన్స్ 100 రూపాయలు తిరిగి ఇవ్వలేదని, నేను మర్చిపోయాను అని! సరేలే పండగ చేసుకుంటాడులే అని మనసులో అనుకుని (నేనేదో వాడికి వెయ్యి రూపాయలు దాన చేసినట్టు) బస్సు ఎక్కాను. ఆ బస్సు ఏమో ఇదిగో ఇలా ఉంది!
రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఎయిర్ ఫోర్స్ క్యాంపస్ వెళ్ళడానికి సుమారు 30 నిముషాలు పట్టింది. మొదటిరోజున మా సర్టిఫికెట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి ఒక పెద్ద హాల్ లోకి తీసుకువెళ్లారు. సుమారు 300 మంది యవ్వనస్థులు మన దేశం నలుమూలన నుండి అక్కడకు వచ్చారు. మొదటి రోజు చాలా టెస్టులు పెట్టారు. అవన్నీ అయ్యేసరికి చాలా తల నెప్పి వచ్చింది. అయినా సరే వదలలేదు, చివరిగా ఒక ఫోటో పెట్టి దానిమీద ఒక వ్యాసం రాయమన్నారు. ఆ ఫోటోను ఒక నిముషం మాత్రమే చూపించారు, కానీ నాకు ఆ ఫొటోలో అసలేమీ కనిపించలేదు. ఆ ఫొటో చాలా బూదరాగా ఉంది. సరే నేను దానికి సంబందించిన నా ఆలోచనలు రాసి పెట్టుకున్నాను. తరువాత వచ్చిన 300 మందిని గ్రూపులుగా విడదీసి, ఆ వ్యాసాన్ని చదవమన్నారు. నేను రాసిన వ్యాసం చదివాను. మీరు చూపించిన చిత్రం కార్గిల్ యుద్ధంలో ని సంఘటనను నాకు ఎందుకో తలపిస్తున్నది, ఒక ఎడారి ప్రాంతంలో మన సైనికులు ఉన్నారు అని నాకు తోచిన చిన్న కథ ఒకటి చెప్పాను!
తరువాత 300 మందిని లైన్లో నించోపెట్టి, మేము పిలిచిన వాళ్లు మాత్రం ఇక్కడ ఉండండి, మిగిలినవాళ్లు మీ ఇంటికి వెళ్లిపోండి అని చెప్పారు. 300 మంది లో కేవలం 40 మందిని ఉండమన్నారు, అందులో నేను కూడా ఒకడ్ని! మీరందరు వారం రోజులు ఇక్కడే ఉండాలి, మిమ్మల్ని తదుపరి స్క్రీనింగ్ చేసి మీలో కొంతమందిని ఎయిర్ ఫోర్స్ లోకి తీసుకుంటాం అని చెప్పారు. నేను మా నాన్నగారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను! అప్పడు మా నాన్న గారి పరిస్థితిని నేను ఒక్క సారి ఊహించుకున్న! బహుశా ఆయన నన్ను ఈ కింద ఫొటోలో ఉన్నట్టుగా ఊహించుకుంటున్నాడేమో అని అనుమానం కూడా వచ్చింది :p !
ఇంక మరుసటి రోజునుండి మదలయ్యాయండీ నా బాధలు! తెల్లవారులు ఒకటే మ్యూజిక్కు ….
అవునండి నిజమే, నేను ఇది అసలు ఊహించలేదు! రోజూ తెల్లవారుజామున 5 ఇంటికి లేగవాలంటా, మేము లెగవడానికి పోదున్నే హిందీ పాటలు పెట్టేవారు. ఆ పాటలు తగలెయ్య, రోజు అదే పాటలు – మనకు హిందీనే అసలు అర్ధం కాదు, పైగా హిందీ పాటలు!
ఇక రూమ్ నుండి బయటకు రావడం అంటూ జరిగితే, యూనిఫామ్ తప్పకుండ ఉండాలి, బూట్లు వేసుకోవాలి, మీ రోల్ నెంబర్ తగిలించుకోవాలి. ఇలా అన్ని రూల్స్ పెట్టారు! ఒక్కసారి తిరిగి మా ఊరులో నా దినచర్య గుర్తుకు వచ్చింది … తెల్లవారు 9 ఇంటికి షార్ట్స్ అండ్ బనియన్ తో లెగవడం ,దర్జాగా అమ్మ చేసిన టిఫిన్ తినండం, ఊరి మీద పడడం! రాజ బోగంలా అనిపించింది ఇంట్లో నేను ఉన్న తీరును గుర్తుతెచ్చుకుంటే!
ఇక రెండో రోజు, కొంత సమయం లాంగ్ జంప్, హై జంప్, పాకులాడుట లాంటి కఠినమైన పరీక్షలు పెట్టారు. నేనేదో ఇంజనీరింగ్ ఉద్యోగ నియామకం కోసం వస్తే ఈ బాధలేంట్రా బాబోయ్ అని అనుకున్న. ఒకసారి అయితే మరినండీ బాబు, ఒక 20 అడుగుల ఎత్తు ఎక్కమన్నారు, అక్కడ నుండి తాడు పట్టుకుని కిందకి దూకమన్నారు (ఏదో పైకెళ్ళి , మాకోసం చాక్లేట్లు కింద పారెయ్ అన్నంత సులువుగా చెప్పారు)! వామ్మో నా జీవితంలో ఇలాంటివి ఎప్పుడు చేయలేదు. పైకైతే ఎక్కాను గాని కిందకు తాడు పట్టుకుని దూకాలంటే భయం వేసింది! కిందేమో ఆఫీసర్లు అందరు చూస్తున్నారు, పైకి ఎక్కి అలా చూస్తా ఉన్నాను, దైర్యం చాలడం లేదు కిందకి దూకడానికి! అక్కడ కింద ఉన్న ఆఫీసర్ బాగా గమనించాడు, ఒక్కసారిగా గట్టిగ అరిచాడు “జంప్” అని, అంతే గుండె జారిపోయింది, పోతే పోయాం అని దూకేశా, తాడు పట్టుకుని కిందకు ఎలాగోలా చేరుకున్న. వెంటనే కింద ఆఫీసర్ దగ్గరకు వెళ్లి, సార్ టాయిలెట్స్ ఎటు ఉన్నాయో చెప్తారా అని అడిగాను!
అలా ఇంకెన్నో కఠినమైన పరీక్షలు పెట్టారు, పరీక్షలు పర్వాలేదు గాని ఆ పోదున్నే హిందీ పాటలు పెట్టి 5 ఇంటికి లేపడం మహా పాపంగా అనిపించింది నాకు!
ఇలా చాలా పరీక్షలు పెట్టారు, చివరిరోజున నాకు ఇంటర్వ్యూ దాదాపు గంటున్నార సేపు జరిగింది. ఇంటర్వ్యూలో ఒక్క ప్రశ్న కూడా నా ఇంజనీరింగ్ సంబంధించిన ప్రశ్న లేదు, అంత నా వ్యక్తిత్వానికి సంభిందించిన ప్రశ్నలే! ఒక సందర్భం ఇచ్చి ఇపుడు నువ్వు ఏమి చేస్తావ్, ఒకవేళ ఆ స్థానంలో ఉంటె ఏమి చేసేవాడివి, ఇలా చాలా ప్రశ్నలు అడిగారు. కొన్ని యుద్దాల గురించి కూడా అడిగారు! చివరిగా అయన జెంటిల్మన్, యు అర్ ఏ వెరీ డీప్ థింకర్ (you are a very deep thinker), కానీ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం నీకు సూట్ అవ్వదేమో అని అన్నారు (ఈ ఉద్యోగానికి నువ్వు సూట్ కావు అని సౌమ్యంగా చెప్పినట్టు నాకు అర్థమైంది). అంత నిజాయితీగా ఆ ఆఫీసర్ చెప్పినపుడు, నేను నిజాయితీగా నా మనసులో మాటను చెప్పేసాను. అవునండి నాకు సైంటిస్ట్ అవ్వాలని ఉంది, “ఐ లైక్ ఫ్రీడమ్ అఫ్ థాట్ (I like freedom of thought)”, నేను సైన్యం లో ఉన్న నియమాలకు కట్టుబడి నా ఆలోచనలను నిర్బంధించుకోలేనేమో, నన్ను కూడా నిర్బందించుకోలేనేమో అని చెప్పాను! నైస్ టూ మీట్ యు అని చెప్పి అయన వెళ్లిపోయారు.
అలా ఆ ఇంటర్వ్యూలో నాలోని కొన్ని కోణాలను బయటకు తీశారు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్! మొత్తానికి మా నాన్నగారి కలని నేను నెరవేర్చలేకపోయాను. బహుశా పొదిగిన గుడ్డు పిల్ల అవ్వలేదని మా నాన్న గారు అనుకుంటున్నారేమో నాకు తెలియదు! కానీ నా స్వతత్రం నాకు ఎప్పడు ఇచ్చారు ……
“కొన్ని ఇంటర్వ్యూలు మనకు ఉద్యోగం తీసుకురాకపోయిన, మనకు మనల్ని పరిచయం చేస్తాయి”